top of page

2. కరములే కరములు

 

ముందుమాట

తీరని వేదన లోగిలిలో ఒదిగిపోయి, తన అస్తిత్వమును శాసించే కరముల క్రియల తత్వములను త్రవ్వుతూ, తద్వారా ప్రేరేపితమైన అంతర్మథనముల హంగులను అవే కరములతో చెక్కే ప్రయత్నపు ఫలితం ఈ కవిత్వం.

 

కవిత

చాచిన చేతుల చేతల నెఱిగి

చరణ శిరసాంతముల చిట్లిచెడిన చేదును చేయార చేది

క్షీరసాగర చంద్రబింబపు ప్రపూర్ణ పరిపక్వత

భావాల భాండాగారాన్ని కుమ్మరించి

చెమ్మ చెదిరిన చెక్కిళ్ళ కౌగిలించు చేతులు చేతులు

నింగి నంటిన నయన రేఖల నిశ్చలత్వం

నిర్మలమైన కరముల నేకాగ్రతకు నివ్వెరపోతుంటే

కన్నుల మౌనయుద్ధపు బాసల యాసలు

కరములకు ఆసరాగా కదం కదుపుతుంటే

మునిపంటి కోపపు జ్వాలాజ్ఞుల కొసలు

దిగుపళ్ళ నిరాడంబరతను భయానకంగా క్షీణింపజేస్తుంటే

అమానుషపు అవాంతరాలకు ఆయువై

సమాంతరపు సావాసానికి మౌనముద్రలో

దహించుకుపోవు మాంసపుముక్క

హాయిగా బోర్లాపడుకొని తమాషా చూస్తుంటే

శ్వాసేంద్రియపు నారదముని బుద్దులు

నరనరాన పాకించిన వర్తమానంతో తనువును వణికిస్తుంటే

అవతరిస్తున్న ఉపద్రవాన్ని పసిగట్టిన

త్రికాలజ్ఞాని శిరస్సింహాసనాధిపతి

న్యూరాణుల గూఢచర్యంలో వాస్తవాలను చేరవేస్తే

చటుక్కున ఉబికివచ్చిన ఆశీతల జలాలు

కాగితంపై కాంతులీనుతుంటే

కలపు జలస్పర్శతో ప్రసన్నులై

పూర్వ అకృతులను అందంగా

అక్షరాల్లో మలుస్తూ ముగిస్తూ

కొట్టివేతల కొట్లాటల నడుమ

నూత్నార్థాన్ని కొలిక్కిపట్టి పెట్టిన కరములే కరములు.

bottom of page