top of page

5.’కాను’ దండకం

ముందుమాట

సంగీత సాధనమునకు దూరమైనా ఓ సంగీత దాహార్థి, తన గానం వేణువు శృతి, ఢమరుక నాదం, వీణ స్వరమాలికలు కలది కాదని, ప్రాకృతిక అంతర్ ప్రళయాల, ప్రకంపనల, ఉరుముల కొలిమిలో నుండి ఉద్భవించే అక్రోధన అంటూ సాగే ఈ కవితతో కదం కదపండి

 

కవిత

కాను వాణీ రమణీ శ్రితవదన సరోరహుడను

కాను గంధబధ్ధపు గంధర్వ సుగళమును

కాను నీలకంఠుని ఢమఢమ నాదమును

కాను స్వరములొలుకు నారదముని వీణను

కాను కమలపీఠపు లయల మాలికను

కాను మకరందములొలుకు శృతుల వేణువును

కాను ఇంద్రలోక విలాస సారమును

కాను హస్తి గాఢ ఘీంకారమును

కాను సరళ సువాక్కుచ్చరణను

నీలి మేఘముల మాఘపు ఉరుముల

కడలి అలల పలు కృతుల నాట్యముల

వృక్షకోటి కనుసన్నల గాలుల

విలయ అనల కలిగే ప్రళయమ్ముల

నిలకడ లేని పృథ్వి ప్రకంపనల

గళమును కాల్చుచు కాగిన కొలిమిల

నూత్న రుచుల నాల్క నానులాడి

పరవశమున నాట్యమాడు ప్రగతికి

కాళస్వరూపుల మెడకు చుట్టుకొను

కాలపు పాదముల గళము కదిపే.

bottom of page