top of page

కలపు కోరలు

ముందుమాట

కలపు కళను విషదీకరించే ఈ కథ,  రచనలారంభించిన ఓ పిచ్చి రచయిత మొదటి అనుభవాలను మనముందుంచుతుంది. రచన అక్షర సముదాయమే గాక భావావేశమును కూడా ప్రతిబింబింప చేయాలని ఆయన చింతిస్తున్నాడు. అటు పిమ్మట, ఆంధ్ర భాషా దయనీయ, దౌర్భాగ్యమైన స్థితిని గూర్చి ప్రస్తావిస్తూ, తన ఆవేశమును మరియు భాషాశయమును వ్యక్తపరిచారు. రచన అంటురోగమని ఛలోక్తిస్తూనే, తన మనసుబాటలు రచనవైపుగా నిర్మించుకుంటున్నాడు. సంక్లిష్టమైన పదప్రయోగం రచయితార్భాటాలను స్ఫురింపజేస్తుంది.

కథ

      వృద్ధకమలాక్షుడు గాఢ మేఘముల స్థావరములన్జేసి, కేయూరలజడులను రణకేంద్ర ఘోషలన్దలఁపుజేయు గాఢ దీక్షావాంఛల త్రోవ మల్లింప, సారములేని నారవంటి మన్మధబాణముల శిరస్సింహాసనాధిపతికి సంధించె. అవి విశ్వామిత్ర యాగభంగ భాద్యతలన్ స్వీకరించిన మారీచ సుబాహుల అమంగళ క్రతువులుగా దోఁచె. అయినను, నిష్ణాతుడనై, కార్యఫలముల అంతరంగమున స్మరించి, నిలకడవాయువుల రొమ్ముల నింపి, కలమును పలు శాస్త్రీయ నాట్యములాడించితి. ప్రప్రథమమైన ఆ కళాఖండపు లయ అప్రధానమైన తొణికిసలాటలను తాళపత్రరూపిపై వీక్షించి, నడక నేర్చిన పసిబాలున్నై, చిందులేసిన చింతలధూళిని ప్రక్షాళనగావించదలచి, అలసిన దేహమును వసారా నుండి గదిలోకి సాగనంపితి. కన్నుల మెదిలిన ఆనందకేళి మిన్నులనంటిన కాండమును పరికించి, పృథ్వికి ఆవల సిగ్గుతో ఒగ్గిపోయెను సూరుడు. విధి స్వలిఖీపవనము!

   —–

సాయంకాల పానీయాల్గావించి, మేడమీదున్న అటకమంచంపై సేదతీర సంకల్పించి పైకేగితిని. కళలేని క్రొత్తకోడలి మోముబ్రోలు నిర్మలాకాశ తీక్షణావీక్షణమునకు సంసిద్ధమై పవళించితి. సానపెట్టని కోర్కెల సాగదీయక నక్షత్రవేట నారంభించితి. అగమ్యమయమైన ఈ వేట ఆశువు ప్రధానమైనది. పొంగిన గంగల జీవితమును బుద్బుదంబుజేసి, ధార ధారణల మెలుకువలు పెకిలించి, మెలితిప్పి, ఆధీనము జేసుకొనవలె. పర్యవసాన పసల పదునెఱుగకున్నను, ఆ రాసాస్వాదనల పట్టు లేకున్నను, పరమపదము శరణమవుట తథ్యము.

—–

బోయవాడై, క్రౌంచ సంహార ఘట్టమును ఆత్మావేశముల కేంద్రీకరించుకొని ఆశువుగా మానీషాదమును బల్కిన వాల్మీకీ ఉన్నపలంగా కన్నులమెదిలెను. ఉచ్చ్వాసలాడి భౌతికమును వీడిన ఆ మాంసాహారి చిరస్మరణీయుడిగా ఉజ్జీవుడై యుండుటలో ఆంతర్యము భావావేశాస్వాదనయని తోచినది. భావావేశమునెఱుఁగని భాషాచాతుర్యత పుష్ప మకరందముల నాస్వాదించలేని అంధాలంకృతమైన నాసికముతో సరితూగునని నే విశ్వసించితి. భాషావిపత్తుల పైయ్యెత్తుల భావములనెప్పుడూ భోరుమనిపించలేవు. సాహిత్యపు ఆవశ్యకతలు అవగతమైననాడు అందముగా నొదిగిపోయెడి భావములు కోకొల్లలు. వీరి ఉభయసాంగత్యం మానవాళిలో పలువిధములైన రసజ్ఞతను ఇనుమడింపజేస్తున్నది, సన్మార్గస్థాపనల విజయరసముల చెమర్చి దేదీభ్యమానముగా ప్రజ్వలింపజేస్తున్నది. అశరీరవాణి ద్వంద్వసమిష్టి తత్వముచే ప్రసన్నమైన తమసు ఆత్రంగా వ్రాయ సంకల్పించె. ఈవల, పొంగిన చింతాకడలి వరదలు నయనద్వారపాలకుల్ని ఎదురీదనీయక వారి విశ్వప్రయత్నములావిరిజేసె, తడిచిన ద్వారములు మనఃవాంఛల భస్మముల కేగనిచ్చె.

—–

వ్రాయ నేర్చిననాడే వీరభాషావ్యామోహమును ప్రదర్శించుట ఉత్ప్రేక్షముగా తోచినా, చేయక తప్పుటలేదు. హృదయాంతరాలలో యేండ్లుగా నలిగినా ఈ ఆవేదనను, అణిచివేయబడుతున్న స్వస్థల భాషాసంస్కృతిపై నా మిక్కిలి మక్కువను, ఈ విధంబుగా భాషాప్రియులకు నివేదించటంలో ఉపశమనము వ్రెతుకులాడితి. పూజనీయమైన ఆంద్రభాషాదేవి వర్ణమాలల ఉనికిని ప్రేమతో ఆత్మనిర్బంధంజేసి, తెనుగు తత్వమును మనస్సున నాటుకొని, దానిని మాహావటవృక్ష సముదాయినిని జేయ సంకల్పించితి. అనుదినం నేలమట్టమవుతూ, హత్యలనెదుర్కొను దిగంబరి వేశ్యయై అలసిసొలసి ఆరుతూ, కన్నీరు కార్చుతూ, అంబర పయనమైన తెనుగు అక్షరమాలకు అభ్యంగనాభిషేకములు జేయ, భాషాప్రావీణ్యతకు ఆజ్యంపోయ భీష్మించితిని. భాషాదుర్గమును స్థాపించి, సృజనప్రియమైన భాషాసిరిని శివాంకితం జేసి, కులశైలంబులకు ధీటుగా తెనుగుగిరుల బాండాగార ఆగమనముల అశ్వరథులమై హరివాడల సంభాషించి, ఆంధ్ర భాషాదేవి అమూల్యాలంకరణముల జేసి భాసిల్లుదున్.

—–

అస్థిర స్వావేశముల పర్యవసానము లెరిగినవాడనై, నిరాఘాటాక్రోధనల కుంభమును క్రమబద్ధీకరించ యోచించితి. నిర్విరామ నిశ్వాసుచ్చ్వాసలు వంతపలికిన ఉసురు మసులుట స్థంభించును. స్వేదాభిషేకముల కకలావికలమవుతూ, ప్రాచీనాంధ్రుల పదప్రాసల పూనకముల సంఘర్షణలు పురివిప్పి ఆడుతుంటే, ఘల్లుమని ఓ హస్తము నా బుగ్గల చుంబించినది. అవసానదశలో ఆయువు క్షీణిస్తున్న భౌతికమును బోలిన నా దేహస్పందనముల జూచి బిడియమాడితి.

—–

గడియారంబు ఎనిమిది గ్రొట్టుచు, నీ భాషను అష్ట దిక్కుల వ్యాప్తిజేయమని హేళనగా ఘీకరించినట్టు తోచినది. నామూషీగా తలదించి, పాదముల నింపాదిగా జూస్తిని. ప్రక్షాళనానంతరం గూడా అపరిశుభ్రంగా అగుపించిన పాదముల మరలా కడిగితి. స్నానమాడి, మారు దుస్తువులు ధరించి, కలువలప్రియుడి వెన్నెలల భోజనమునకు పయనమయ్యితి. దైనందిన కైంకర్యముల ఆపాదించిన శాంతి, బల్లపైనున్న కలమును జూచి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఝూలు ఝులిపిన వేదనరోదనలు మనసును ప్రేమ పేరుతో హత్తుకున్నవి.

---

మాటల మాటువేసే కలపుకోరలు ఈ దేశదిమ్మరి భౌతికముపై భాషోదారత సంజ్ఞల స్ఫురింపజేస్తున్నాయి. శ్లాఘింపబడే ప్రతీ విలాసాభ్యాసము ఓ వ్యసనము. క్షత్రియుని ఖడ్గము, కర్షకుని కొడవలి, కరముల కలము లోకాభివృద్ధి సూచికలు. పట్టు పట్టరాదు, పట్టిన విడువరాదను మాట మనసున అందంగా మెదిలెను. ఆత్మస్థైర్యముతో అటుగా అడుగు నయితి. ఆరభించి, మందబుద్ధిగల మధ్యముడనై పరిత్యజింతజాల తగదని మరో గొంతుక. ఇక ఒద్దికనేల, భాషావలంబనం గావించి తరింతును.

bottom of page